|
|
|
  | |
| |
తెలుగు భాషా సారస్వతం "అమృత వాఙ్మయం" తెలుగు భాషా సారస్వతామృతమే ఈ
వెబ్ సైట్ లో మీరు చూరగొంటున్నారు. భాషాసారస్వత వికాసారంభం, దాని సర్వ వ్యాపకత్వం
సర్వ సద్గుణమయత్వాలను నిరూపిస్తోంది ఈ వెబ్సైట్. భాషామృతం అంటే భాషాసాహిత్యామృతమే.
అమృతం క్షీరసాగరాన్ని చిలికినప్పుడు వచ్చిన సాగర సారమే. అలాగే భాష సారస్వతాన్ని
మధించి అంశించే సారభూతమైన తెలుగు సాహిత్యవిశేషాలు ఈ వెబ్ సైట్ లో విశద రీతిలో
ఉంటాయి. కేవలం సంవత్సరాల పట్టికలేకాక ఆయా కవుల రచనల్లోని వివిధకోణాలలో పరిశీలించి
వెలికితీసిన సత్యాలు మీకందించడమే దీని ప్రధానోద్దేశ్యం . ఇది కేవలం ప్రాచీన
చరిత్రమాత్రమే కాదు. ఇది సారస్వత సరస్వతీ స్తన యుగ్మ సంజనితామృత మకరందం. ఈమె
తల్లిగా బిడ్డలైన మనందరికీ పంచి ఇచ్చే పాలిండ్ల పొంగారుబంగారు తేనెలు అని
మనవి.
ఈ కోవలోనే భాషామృతం ఏ భాషాసారస్వతంలోనైనా దొరుకుతుంది. ఐనా " ది
ఇటాలియన్ ఆఫ్ ది ఈష్ట్ "ఆని పేరు మోసిన తెలుగు భాషా సారస్వతం మొట్టమొదటిగా
చవిగొనవలసినది కనుక దానినే పాఠకుల ముందుంచుతున్నాం. " తెలుగు తేటె, కన్నడ కత్తురి"
అని శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలోనే తెనెలూరే తేట తెలుగు వైశిష్ట్యం
కొనియాడబడింది.
స్వయంగా రాజకవి, కవిరాజు, కవిరాజపోషకుడు, కవీశ్వరపక్షపాతి,
ఉభయభాషాపాండిత్యమేకాక దేశీయ సాంఘికజీవనవిధానాలు చక్కగా పరిశీలించిన చక్రవర్తి
శ్రీకృష్ణ దేవరాయలు. అటు కన్నడం లోనూ ఇటు తెలుగులోనూ లేఖనాంత పాండిత్యం గల్గి
క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు శ్రీకృష్ణదేవరాయలు.
ఆయనే తెలుగదేలయన్న
దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొ కండ ఎల్ల నృపులు గొలువ
యెఱుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స.
అని తెలుగును దేశీయ భాషలలో
గొప్పదిగ చాటి చెప్పినవాడు శ్రీకృషణదేవరాయలు 56 అక్షరాలతో అలరారుతూ సంస్కృత భాషతో
సమానంగా పలుకుబడికి కావలసిన సంపూర్ణవర్ణజాలాన్ని సంతరించుకొనడమే కాక అజంతభాష కావడం
వలన తెలుగు సాహిత్యానికే కాక సంగీతానికి కూడా సొంపులు ఇంపులు కూర్చగల్గిన భాష
తెలుగు.
కనుక తెలుగు భాషా సాహిత్యాన్ని గురించి వెబ్సైట్ ను మీ ముందుగా
ఉంచడానికి ప్రయత్నిస్తునాం
తెలుగు - తెనుగు - ఆంధ్రము
ఆంధ్ర శబ్దాన్ని భాషా పరంగా వాడిన రీతిని పూర్వపు వ్యాసంలో చూపించడం జరిగింది.తెలుగు శబ్దం కూడా ప్రాచీనంగానే వాడబడుతూ వస్తోది, ఇదే విధంగా తెనుగు అనే శబ్దం చాలా ప్రాచీన కాలంలోకూడా వాడబడింది.
తెనుగు
దీనికే తెనుంగు, తెన్గు అనే రూపాంతరాలు కూడా కనుపిస్తున్నాయి. రాజరాజ నరేంద్రుడు "తెనుగున రచియింపు మధికధీయుక్తిమెయిన్" అని తెనుగు శబ్దాన్నే వాడుతూ నన్నయ గారిని భారతాంధ్రీ కరణం చేయమని అడిగాడు. ఇక్కడ నకారం పద్యంలోని ప్రాస స్థానంలో ఉండడం వలన తప్పక తెనుగు శబ్దాన్నే ఉపయోగిం చాడని మరొక పదాన్ని ప్రయోగించలేదని చెప్పవచ్చును. నన్నయ భట్టుకూడా "తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్ "అనడం వలన ఈతడు కూడా తెనుగు అనే శబ్దాన్నే వాడాడని తెలుస్తోంది. నన్నెచోడుడు కూడా తెనుంగు శబ్దాన్ని వాడాడు.పాల్కురికి సోమనాథుడు మాత్రం జాను తెనుగు అని బిందు రహితంగావాడాడు. తిక్కన కూడా "తెనుగుబాస వినిర్మింప దివురు చరల " అని తెనుగు బాస అని వాడాడు.
తెనుగు శబ్దోత్పత్తి
మూడు పర్వతాల(త్రినగముల) నడుమ ఉన్నది - "తెనుగు". త్రినగశబ్దం నుండి తెనుంగు శబ్దం వచ్చింది, అని భాషాశాస్త్ర విమర్శకుల మాట. మన దేశానికి త్రినగమని పేరు ఉంది.
"పూర్వాంభోనిధి కాళహస్తి శిఖరి ష్రీమన్మహేంద్రాచల శ్రీశైలై ర్వలయీకృతాంధ్ర విజయం శ్రీ రాజరాజ స్వయం " అని ఒక శాసనం క్రీ.శ.1169 లో ఉంది. దీనిని బట్టి శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహెంద్రగిరి అనే మూడు నగాల మధ్య ఉన్న దేశంగా చెప్పవచ్చును. కాని ఱ్ ప్రయోగం సాహిత్యంలో ఎక్కడా కానరాదు. కనుక దీన్ని ఎవరూ అంగీకరించడం లేదు.
దిక్పరం "తెనుగు" శబ్దం.
"తేనె అగు" అనే రెండు శబ్దాల కలయిక వలన తెలుగు అనే శబ్దం ఏర్పడిందని కొందరి అభిప్రాయం అనీ, ఇది ప్రసిద్ధ భాషా శాస్ట్ర వేత్తలు గ్రియర్సన్, కల్డ్వెల్ లు చెప్పినట్లుగా చెబుతారు.ఈ నిర్వచనం కూడా బహు జన సమ్మతం కాదు.మరొక విధంగా "తెన్" అంటే దక్షిణం అని అర్థం.ఈ శబ్దం మీద "గు" అనే ప్రత్యయం చేరితే "తెన్గు" అయ్యిది. అదే తెనుగుగా మారి ఉంటుంది. "తెమ్మెర", "తెంకాయ" శబ్దాలోని "తెన్" కూడా ఈ శబ్దమే. "దక్షిణాపథం" "ఉత్తరాథం" వంటి శబ్దాలులాగే తెన్+గు అయ్యింది అని భషా శాస్త్ర వేత్తలు కూడా ఒప్పుకున్నారు. తమిళులు తెనుగు వారిని "వడుగర్" ఉత్తర దిక్కున ఉన్నవాళ్ళు అని వ్యవహరిస్తారు. అలాగే ఉత్తరం వారు ఆంధ్రులను తెనుగువారు అనడంలో తప్పు లేదు గదా. కొడగు అనే పదానికి కూడా పడమటి దిక్కులో ఉన్న భాష అని అర్థం కనుక తెనుగు దిక్పరంగా చెప్పడమే మంచిది.
తెలుగు (తెలుంగు, తెలుగు, తిలింగ, తెలిగ, తెలుంగ, తైలింగ)
మహాభారతంలో నన్నయ తిక్కనలు తెలుగు శబ్దాన్ని ప్రాస స్థానంలో వాడలేదు. కాని నిర్వచనోత్తర రామాయణంలో తెలుగు శబ్దాన్ని ప్రాసస్థానంలో తిక్కన వాడాడు. కేతన, పాల్కురికి సోమనలు తెలుగు శబ్దాన్ని వాడారు. "కలింగత్తుప్పరణి"అనే తమిలగ్రంథంలో క్రీ. శ. 12 వ శతాబ్దం "తెలుంగన్" అని తెలుగు వాడు అనే అర్థంలో వాడారు. "నన్నూల్" అనే గ్రంథంలో "పవణంది" అనే రచయిత "తెలుంగం" అని "తెగం " అనీ ప్రయోగించాడు. కన్నడంలో కేశిరాజు "తెలుంగితి" అని ఆంధ్ర స్త్రీ అనే అర్థంలో వాడాడు. తమ్మ సిద్ధి శాసనంలో "తిలింగ విద్యా నృపతిః" , తిలుంగ బిజ్జ " అని ఉంది. "తెలుంగర్" అని రాజరాజుకు (క్రీ.శ. 985-1004) "తెలింగకుల కాల " అని విక్రమచోళునికి(క్రీ.శ. 1155) విశేషణాలుగ శాసనాల్లో రాసారు.
త్రి కళింగమే - త్రిలింగము
ఉత్కళింగము, మధుకళింగము, కళింగము అనే మూడూ కలిపి త్రిలింగమని ఒక వాదన . మహాభారతంలో కూడా కళింగ శబ్దం మూడు మాట్లు వాడబడిన కారణం ఇదే. త్రికళీంగ= తి+అ+లింగ= తెలుగుగా మారింది. ఇది చరిత్ర సాక్ష్యం.
తిలగు - తెలుగు
"సర్సా స్తిలవద్గావో యత్ర సన్తి సహస్రశహ్ సః దేశః తిలగుర్నామ" అని ఆంధ్ర వాఙ్మయ చరిత్ర చెబుతోంది. తిలలు వలె నల్లని వేలకొలది గోవులు ఎక్కడ ఉన్నాయో ఆ దేశం తిలగు దేశం. అదే "తిలగు" గానూ "తెలుగు" గానూ మారింది అని అంటారు.
ఇలాగే ఎన్నో భావాలు తెళగన్నడమ్= తెలుగు అని, తేట+గు = తెలుగు అని, "తెలైంగ= తెలుగు అని అనేకరకాలుగా చెబుతున్నారు.
కాల్డ్ వెల్ , తారానాథుని గ్రంథాలలో క్రీ.శ. 150 నాటికి త్రిలింగ శబ్దం సుపరిచితం అని , ఈ విషయం "టాలెమీ" అనే చరిత్రకారునికి తెలుసునని నిర్ణయించారు.
క్రీ.శ. 1027 లో ఇంద్ర వర్మ పురీ శాసనంలో "తిరిలింగ వాస్తవ్యాయ" అని వాడబడింది.క్రీ.శ. 10 వ శతాబ్దానికి ముందు ఉన్న రాజశేఖరుడు తన "విద్ధసాల బంజిక" నాటకంలో " జయతు జయతు త్రిలింగాధిపో దేవః" అని తిలింగ శబ్దాన్ని ప్రయోగించాడు.
క్రీ.శ. 14వ శతాబ్దానికి పూర్వం విద్యానాథుడు ప్రతాపరుద్ర మహారాజుకు "త్రిలింగ పరమేశ్వర " అనే విశేణాన్ని వాడాడు.
అక్కల పూండి శాసనంలో (క్రీ.శ. 1318) "త్రిలింగదేశాధిపతిః శ్రీమాన్ అని ఉంది.
తెలుగు త్రిలింగ శబ్దభవం, అని త్రిలింగాల గురించి చాలామంది చెప్పారు. విన్నకోట పెద్దన క్రీ.శ.15 వ శతాబ్దానికి పూర్వ భాగంలోనే త్రిలింగ శబ్దాన్ని గురించి ఇలా అన్నాడు.
కం. దరశ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఞ వరలు త్రిలింగా
కర మగుట నంధ్రదేశం
బరుదార ద్రిలింగ దేశమన జను గృతులన్.
"తత్త్రిలింగ పదము తద్భవమ్బగుటచే
తెలుగు దెశమన తేట వడియె
వెనుక దెనుగు దేశమును నండ్రు కొందఱు"
అని చెప్పారు.
అప్పకవి క్రీ.శ. 1650 ప్రాంతంలోనే
కం-
శ్రీ క్శితి ధర కాళేశ
ద్రాక్షారమంబు లనగ దనరారెడు నీ
త్రిక్షేత్రమ్బుల లింగము
నీక్ధింప ద్రిలింగ సంజ్ఞ నెన్నిక కెక్కున్.
తత్త్రిలింగ నివాసంబు తనరు కతన
నాంధ్ర దేశంబు త్రిలిగాఖ్య మయ్యె.
అని క్రీ.శ. 1600 నాటికే చెప్పాడు. కనుక త్రిలింగ శబ్డం, తద్భవమైన "తెలుగు"గా మారింది అని నిర్ణయించారు. ఈ విధంగా తెలుగు శబ్దం విక్రృతి శబ్దం అనక తప్పడు. దీనినే సర్వ సమర్థనీయంగా పండితులందరు అంగీకరించారు.
రచన
డాక్టర్. అమృత వాక్కుల శేషకుమార్.(భారత్ గురు)
ఎమ్.ఏ.,ఎమ్.ఏ.,ఎమ్.ఏ.,ఎమ్.ఏ.,పి హెచ్. డి.
నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్. ఈండియ.
|
|
|