Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery
 

దేవాలయాలు

దేవాలయాలు సంస్కృతికి చిహ్నాలు.దేవాలయ సంస్కృతి ఎప్పుడు పుట్టిందో చెప్పడం కష్టమేగాని, పూర్వం సామాజిక కర్యక్రమాలకు కూడళ్ళు దేవాలయాలే. సాహిత్య సామాజిక కార్యక్రమాలకు, సాస్త్రచర్చలు, కళాపోషణలకు ఇవే సరయిన చోట్లు. జాతి సంస్కృతి, గాథలు, శిల్పం . వాస్తు, తరతరాల సనాతన సంప్రదాయం సజీవ సమాజ నిర్మాణానికి వెన్నుదన్నులందించినవి దేవాలయాలే. గ్రామ కట్టుబాట్లకు ఇవె నెలవులు.విద్యాలయాలు దేవాలయలలోనే జరిగేవి. ప్రతివూళ్ళోనూ బాటసారులు విశ్రమించడానికి తగిన ఏర్పాట్లు ఈ దేవాలయాల్లోనే, గ్రామంతరాలనుండి అన్య గ్రామాలకు వెళ్ళే వారికి మధ్యలో భోజనాది సౌకర్యాలను కల్పించేవి దేవాలయాలే.

దేవాలయాలు గ్రామీణులకు ఉపాధిని కూడా కల్పించాయి. గ్రామంలో దేవాలయ ఉత్సవాలకు నిత్య నివేదనలకూ కావలసిన కుండలు వంట పాత్రలు కల్పించేందుకుగాను కుమ్మరికి దేవుని మాన్యం పేర పొలాలు ఉండేవి. నిత్య మంగల గీతాలాపనకు బాజాభజంత్రీలు ఏర్పాటు చేసి అందుకుగాను సన్నాయీ లేక ఆయా ప్రాదేశిక యంత్ర వాద్యగాళ్ళు అయిన నాయీ బ్రాహ్మణులకు ( మంగలి ) మాన్యాలు ఉండేవి. సంగీత నృత్య ప్రదర్శనలకు గాను దేవదాసీ ప్రధ, మధ్య కాలంలో వచ్చింది. దీనికోసం నర్తకీమణులు సంగీత విద్వాంసులు వాటికి తగిన వాద్య కారులు, ఈ దేవాలయాలచేత పోషింపబడేవారు. వాహనాలను మోయడానికి దేవాలయాలను శుభ్రపరచడానికి, పందిళ్ళు వేయడానికి, డివిటీలు పట్టడానికి, రంగులు వేయడానికి, భోజన వసతులు ఏర్పాట్లు చేయడానికి తగిన మనుష్యులను ఏర్పాటు చేసి వారి భుక్తిని జరిపే అలవాటు ఉండేది. ఈ సేవాకైంకర్య దారులందరికీ వంశపారంపర్య హక్కులు ఉండేవి. దీనికి తగిన ఆదాయాలు అచ్చేలాగ భూపతులు భూమి పుట్రలు, ఏర్పాటు చేసేవారు. ఆయా గ్రామీణ ప్రజలు వారి వారి దాన ధర్మాలవలన దేవాలయాలలోని మూర్తులకు ఆభరణాలు అర్పించేవారు.

దేవాలయాల ఆలనా పాలనా అక్కడి గ్రామ పెద్దలే చూశేవారు. దేవాలయ మాన్యాలనే పేర దేవాలయాలకు గల మడులు, కిరీటాలు మణి మాణిక్యాలు ఆభరణాలూ కూడా గుడిపూజారి దగ్గర ఉంటూ గ్రామ పెద్దల అజమాయిషీలో వాటి ఉపయోగాదులు జరిగేవి.

దేవాలయాల కట్టుబడి సమయాల్లో పనివాళ్ళు సాధారణంగా ఆ గ్రామస్థులే ఉంటూ, శిల్పకారాదులు మాత్రం రజ నిర్ధారణ పురస్సరంగా వర్తించేవారు. దీనివలన కూడా గ్రామీణులకు ఆదాయం ఉండేది.

అన్ని దేవాలయాల్లోనూ అర్చకులు వేద-ఆగమ విద్యా నిపుణులైన బ్రాహ్మణులే. వీరు కేవలం దేవాలయ అర్చకత్వమేగాక గ్రామంలోని పిల్లలకు విద్య నేర్పడం, పెద్దలకు వైద్యం చేయడం, గ్రామ అభి వృద్ధికి తగిన పూజా హోమాదులు ఏర్పాట్లు చేయించి ప్రజలకు సుఖ కరమైన జీవితం కోసం పాటు పడేవారు. ఎవరి ఇళ్ళల్లోనైన వివాహాది శుభ కార్యాలు జరగడానికి కావలసిన ముహూర్త నిర్ణయాలు, గృహ ప్రవేశాదులకు, గృహారంభాలకు ముహూర్తాలు పెట్టడం వంటి పంచాంగ జ్ఞానాన్ని పంచి ఇస్తూ గ్రామంలో తలలో నాలుకలాగ ఉంటు ఉండేవారు. గ్రామంలో నియమ నిష్ఠలతో కాలం గడిపే ఆహితాగ్నులు వీరు. వీరికి కష్ఠం కలిగితే అరిష్టం కలుగుతుందని భావించేంతటి పవిత్రంగా ఉండేవారు. వారి ఆత్మ గుణాలు ఎక్కడ దెబ్బతింటాయోనని చాలా జాగ్రత్తగా వారికుటుంబము వారు అందరూ దేవ చింతనతో కాలం గడుపుతూ ఉండేవారు.

ప్రతి గ్రామం లోనూ ఏదో ఒక దేవాలయమ్ ఉండడమ్ ఆంధ్ర సంప్రదాయం. కనీసమ్ గ్రామ దేవత దేవాలయం ఉండడం తెలుగు సంప్రదాయం. గ్రామ దేవతల దేవాలయాలు సాధారణంగా ఊరికి నడి బొడ్డులో ఉంటాయి. వీటిలో మాత్రం అబ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉండడం సమ్ప్రదాయం. ఈ ఆలయాల్లో కోళ్ళు, మేకలూ బలి గా ఇచ్చి నైవేద్యం పెడతారు. మామూలు రోజులలో పళ్ళు, పూవులు, వండిన వంటకాలు అయిన తీపి పొంగలి, చింత పండుతో చేసిన పులిహారవంటి అన్న ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెట్టడం ఆచారం.

తరువాతి కాలంలో అమ్మవార్ల దేవాలయాలు ఊరి చివర ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. ప్రతి ఊళ్ళోనూ ఆంజనేయ స్వామి వారి దేవాలయం శివాలయం తప్పక ఉండేవి. విష్ణు మూర్తీ దేవాలయాలు తరువాత చోటు చేసుకొన్నాయి.

కొన్ని ప్రంతాలలో ఐతే గ్రామ దేవతల ఆలయాల్లోనే పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగడం చూస్తాం.
ఇలా దేవాలయాల చరిత్రలు, వాటి ఔన్నత్యాలను చాటుతూ ఈ శీర్షికలో ఇంకా చర్చిద్దాం.